ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లోనూ త్వరలోనే గాల్లో ఎగిరే ట్యాక్సీలు.. ధర కూడా తక్కువే.. ఎప్పటి నుంచి అందుబాటులోకి అంటే?

national |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2024, 11:57 PM

నగరాల్లో ఉండే ప్రజలు నిత్యం ట్రాఫిక్ కష్టాలతో అల్లాడిపోతూ ఉంటారు. గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి అవస్థలు పడుతూ ఉంటారు. దీంతో విదేశాల్లో ఫ్లయింగ్ ట్యాక్సీల గురించి విని మనకు కూడా అలాంటివి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ చిక్కులు లేకుండా వేగంగా వెళ్లిపోవాలి అని భావిస్తారు. అలాంటి వారికి ఒక గుడ్‌న్యూస్. త్వరలోనే ఈ ఏడాదిలోనే ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలు సేవలు ప్రారంభించనున్నాయి. మన భారత దేశంలోనే తయారు చేసిన ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ గురించి ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది.


ఐఐటీ మద్రాస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఈ ఫ్లయింగ్ ట్యాక్సీని తయారు చేశారు. ఈ సందర్భంగా తన ఎయిర్ ట్యాక్సీ గురించిన విశేషాలను మీడియాకు వివరించారు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీని ఐఐటీ మద్రాస్‌ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి రూపొందించారు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీకి e200 అని పేరు కూడా పెట్టారు. మరో 7, 8 నెలల్లో ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. బ్యాటరీతో నడిచే ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీలకు సంబంధించి తయారీ, భద్రత ప్రమాణాలు, నియంత్రణ, నగరాల్లో ప్రయాణాలకు సంబంధించిన వివరాలను ప్రొఫెసర్ సత్య చక్రవర్తి వివరించారు.


  ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ తయారీలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని.. చాలా తక్కువ ప్రదేశంలో కూడా ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలు ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలో ముందుగా బ్యాటరీని పరీక్షిస్తామని.. ఆ తర్వాత తక్కువ దూరం ప్రయాణాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇక ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ అన్ని సవాళ్లను ఎదుర్కొందని.. దీనికి నిర్వహించిన అన్ని టెస్ట్‌ల్లో పాస్ అయిందని ప్రొఫెసర్ సత్య చక్రవర్తి స్పష్టం చేశారు. ఈ e200 ఫ్లయింగ్ ట్యాక్సీలు ఈ ఏడాది అక్టోబర్- నవంబర్‌ నెలల్లోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎమర్జెన్సీ సమయాల్లో e200 ట్యాక్సీలో పారాచూట్లు కూడా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.


ఇక ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ ధరలు సామాన్యులకు కూడా అందుబాటులో ధరల్లో ఉంటాయని ప్రొఫెసర్ తెలిపారు. ప్రస్తుతం రోడ్లపై తిరిగే ఉబెర్ ట్యాక్సీలతో పోల్చితే రెట్టింపు ధరలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీల వల్ల ప్రజలు అతి తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరడంతో వారికి సమయం ఆదా అవుతుందని వివరించారు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీల వల్ల నగరాల్లో ట్రాఫిక్ సమస్య కూడా చాలావరకు తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com