ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా తలెత్తిన రాజకీయ సంక్షోభం.. హిమాచల్ ప్రదేశ్‌లో మరింత ముదురుతోంది. కాంగ్రెస్ హై కమాండ్ రంగంలోకి దిగి.. పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నాలు చేసినా.. అవి ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఉన్న ఒకే ఒక్క రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోలేక బీజేపీకి అప్పగించేసిన తరుణంలో త్వరలోనే ఆ రాష్ట్రంలో అధికారం కూడా బీజేపీ వశం కానుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా క్రాస్ ఓటింగ్ చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలతోపాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సహా మొత్తం 11 మంది ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని రిసార్టులకు వెళ్లడం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంచిన అభిషేక్ మను సింఘ్వీ కాకుండా బీజేపీ నిలిపిన హర్ష్ మహాజన్ విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు.. బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు ఓటు వేశారు. అయితే ఇప్పుడు ఆ ఆరుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుగా ఉన్నట్లు వార్తలు రావడం పెను దుమారానికి కారణం అయింది.
తాజాగా ఆ ఆరుగురు శాసనసభ సభ్యులతోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు శనివారం ఉత్తరాఖండ్‌లోని రిషికేష్ సమీపంలో ఉన్న ఓ రిసార్ట్‌కు వెళ్లడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం కూలిపోనుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. వీరికి మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా కలిసి.. వారంతా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని.. రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీంతో త్వరలోనే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి.. ఆ స్థానంలో బీజేపీ సర్కార్ కొలువుదీరే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్‌పై ఓటింగ్‌కు దూరంగా ఉన్న ఆ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, దేవీందర్ కుమార్ భుత్తు, ఇందర్ దత్ లఖన్‌పాల్, రవి ఠాకూర్, చైతన్య శర్మలను ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా సస్పెండ్ చేశారు. వీరితోపాటు మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు హోషియార్ సింగ్, కేఎల్ ఠాకూర్, ఆశిష్ శర్మ.. ఫిబ్రవరి 27 వ తేదీన జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు మద్దతుగా ఓటు వేశారు.
బీజేపీ హై కమాండ్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సుఖ్వీందర్ శుక్రవారం ఆరోపించారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను సీఆర్‌పీఎఫ్ రక్షణలో బీజేపీ ఉంచుతోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలతో వ్యాపారం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు సొంత రాష్ట్రానికి తిరిగి రావాలని వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారని సుఖ్వీందర్ సింగ్ సుఖూ తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలపడంతో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది. మ్యాజిక్ ఫిగర్ 35 కాగా.. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభ్యర్థి ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో బలం లేదని.. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.