నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు తెలుగుదేశంలో చేరనున్నారు. ఆ పార్టీ తరపున కూటమి అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేలా ప్రణాళిక ఖాయమైంది. ఇప్పటికే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుకున్నారు. ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనే విషయమే తేలలేదు. తెలుగుదేశం–జనసేన కూటమితో బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత స్పష్టత వస్తుందని రఘురామరాజు ప్రకటిం చారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగుదేశం – జన సేన ఉమ్మడి జెండా సభ వేదికపై నుంచే తన మనసులో మాట చెప్పారు. బీజేపీ తరపున లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే వైసీపీతోపాటు, కొన్ని అదృశ్య శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారన్న ప్రచారం సాగింది. దీంతో నర్సాపురం లోక్‌సభ స్థానంపై ఒకింత సస్పె న్స్ ఏర్పడింది. టీడీపీ–జనసేన–బీజేపీల మధ్య పొత్తు కుదర డంతో లోక్‌సభ స్థానాల సర్దుబాటుపై తర్జన భర్జనపడ్డారు. బీజేపీ కూటమి తరపున ఆరు సీట్లు ఇచ్చేందుకు చంద్రబా బు, పవన్ అంగీకరించారు. నరసాపురం ఎంపీ స్థానాన్ని రఘురామకు కేటాయిస్తేనే దానిని బీజేపీకి ఇస్తామంటూ చంద్రబాబు ఆ పార్టీ అగ్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే విషయానికి జనసేన అధినేత కట్టుబడ్డారు. ఇద్దరు నేతల ఏకాభిప్రాయన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద ఉంచారు. లేదంటే వేరే స్థానాన్ని తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఏలూరు స్థానంపై బీజేపీ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా రఘురామ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. టీడీపీలోకి ఆయన రావడాన్ని పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు. పొత్తులో భాగంగా భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం జన సేనకు కేటాయిస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక నేతలకు చంద్రబాబు నేరుగా వివరిం చారు. దీంతో ఎంపీ రఘురామ బీజేపీ తరపున పోటీ చేస్తే మూడు నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు లేకుండాపోతుంది. ఇప్పుడు టీడీపీ తరపున ఎంపీ రంగంలోకి దిగడంతో ప్రతి నియోజకవర్గంలోనూ సైకిల్ గుర్తు ఉంటుందంటూ టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.