పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిన్న (సోమవారం) మెడికల్ కాలేజీని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి స్పందిస్తూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పులివెందులలో మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి లేదని తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీని సీఎం జగన్ రెడ్డి ప్రారంభించారని విమర్శించారు. అసంపూర్తిగా మెడికల్ కాలేజీని ఆగమేఘాలపై ప్రారంంభించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందనే భయంతోనే సీఎం మెడికల్ కాలేజిని ప్రారంభించారని మండిపడ్డారు. పులివెందులలో నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నారని ఆరోపించారు. పులివెందులలో బీజేపీ, జనసేనలతో కలిసి ప్రచారం మొదలుపెడతామని బీటెక్ రవి వెల్లడించారు.