రాష్ట్రంలోని ఏ కార్యాలయాన్నైనా, సంస్థనైనా సందర్శించేందుకు, తనిఖీ చేసి రికార్డులు జప్తు చేసేందుకు, వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసేందుకు వీలుగా అపరిమిత అధికారాలు కల్పించాలని కోరుతూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ కొల్లి రఘురామిరెడ్డి.. ప్రభుత్వానికి రాసిన లేఖను, దానికి అనుగుణంగా తీసుకున్న చర్యలను చట్ట, రాజ్యాంగవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ‘టీడీపీ నాయకులు, మద్దతుదారులను తప్పుడు కేసులలో ఇరికించాలనే ఉద్దేశంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అక్రమంగా అధికారాలు కట్టబెట్టబోతున్నారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల రఘురామిరెడ్డి రాసిన లేఖకు అనుగుణంగా ముఖ్యమంత్రి సహా సంబంధిత అధికారులు ఎలాంటి ఉత్తర్వులు, నోటీసులు, సర్క్యులర్లు, ఆర్డినెన్స్ తదితరాలు జారీ చేయకుండా నిషేధం విధించాలని కోరారు. రఘురామిరెడ్డి లేఖపై యథాతథస్థితి పాటించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్)శాఖ, డైరెక్టర్ ఆండ్ ఇన్స్‌స్పెక్టర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) శాఖలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. సీఎం జగన్, ఐపీఎస్ కొల్లి రఘురామిరెడ్డిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.