‘ఎవరికి ఎన్ని సీట్లు అనేది ప్రధానం కాదు. 175 సీట్లలో మూడు పార్టీలు పోటీ చేస్తున్నట్లే. కచ్చితంగా ఈ నవశకం పొత్తు రాష్ట్రానికి మేలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తలరాతను మారుస్తుంది’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకొచ్చి నవ శకంలోకి అడుగుపెట్టడానికి పొత్తు ఎంతో ఉపకరిస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు తన అనుచరులతో కలిసి మంగళవారమిక్కడ జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ సమక్షంలో పార్టీలో చేశారు. ఆయన వీరందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు. ‘ఒక అసాధ్యమైన, అసాధారణమైన రాజకీయ కలయికను రాష్ట్రంలో సాకారం చేయగల శక్తిని మీ అభిమాన బలమే నాకు అందించింది. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయినా ప్రజల గుండెల్లో నాకు అత్యున్నత స్థానం ఇచ్చారు. ఆ బలంతోనే రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకోవాలనే తపనతో కేంద్ర పెద్దలను ఒప్పించి మరీ అసాధ్యంగా కనిపించిన పొత్తును సుసాధ్యం చేశాను’ అని తెలిపారు. పొత్తులో భాగంగా జనసేన తీసుకున్న సీట్లపై చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, 2019లో తాను ఒక్కచోట గెలిచినా ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉండేదని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జగన్‌తోపాటు జగన్ జలగలను ఏరిపారేద్దామని పిలుపిచ్చారు.