2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయ వేదికగా సీఎం జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నేతలకు జగన్ పెద్దపీట వేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 2019తో పోలిస్తే ఈసారి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ నేతలకు ఎక్కువ సీట్లు కేటాయించారు.
ఏపీలోని175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లు కలిపి మొత్తం 200 స్థానాలకు గానూ 50 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలకు కేటాయించారు. 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీ 59, ఓసీలకు 100 సీట్లు కేటాయించారు. వంద సీట్లగానూ 84 ఎమ్మెల్యే, 16 ఎంపీ సీట్లలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ నేతలకు అవకాశం కల్పించారు. ఎంపీ సీట్లలో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1,బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లను కేటాయించారు. మహిళలకు ఐదు ఎంపీసీట్లు కేటాయించారు.ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే 175 సీట్లలో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, బీసీలకు 48, ఓసీలకు 91 సీట్లు కేటాయించారు. మైనారిటీలకు 7, మహిళకు 19 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు.
2019తో పోలిస్తే..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో కంటే 7 ఎమ్మెల్యే సీట్లు అదనంగా కేటాయించారు. మహిళలకు 4 ఎమ్మెల్యే స్థానాలకు ఎక్కువగా కేటాయించారు. 2019 ఎన్నికల సమయంలో బీసీలకు 41 ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తే ఈసారి 48 సీట్లు కేటాయించారు. మహిళ విషయంలోనూ 2019లో 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. 2024లో19 స్థానాలు కేటాయించారు. 2019లో మైనార్టీ వర్గాలకు 5 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. 2024లో ఏడు స్థానాలు కేటాయించారు. 2019తో పోలిస్తే మహిళలకు ఈసారి రెండు ఎంపీ సీట్లు పెంచారు. 2019తో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 4 ఎంపీ సీట్లు అధికంగా కేటాయించారు.