జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పొత్తుల వ్యవహారం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇన్నిరోజులూ తనకు బలమైన మద్దతుదారులుగా నిలిచిన నేతలు సైతం అధినేత మాటను లెక్క చేయడం లేదు. సీటు కోసం పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల జనసేనలో టికెట్ల లొల్లి నడుస్తోంది. తిరుపతి, పిఠాపురం, అనకాపల్లి ఇలా జనసేన పోటీ చేస్తున్న చోట పార్టీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. తాజాగా జనసేనానికి సన్నిహితుడుగా చెప్పుకునే పోతిన మహేష్ కోసం టికెట్ కోసం పోరుబాట పట్టారు.
విజయవాడ వెస్ట్ టికెట్ కోసం గత కొంతకాలంగా పోతిన మహేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సీటు కోసం టీడీపీలో బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్ పోటీ పడుతుండగా .. పొత్తులో భాగంగా ఈసీటు జనసేనకు వెళ్తుందనేవార్తలు వచ్చాయి. దీంతో టికెట్ తనదేననే ధీమాలో పోతిన మహేష్ ఇన్నాళ్లూ ఉంటూ వచ్చారు. అయితే టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ కూడా వచ్చిచేరటంతో పోతిన మహేష్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ ఇప్పుడు బీజేపీకి కేటాయించనున్నట్లు తెలిసింది. దీంతో అధిష్టానంపై పోతిన మహేష్ మండిపడుతున్నారు. ఆయన అనుచరులు పోతిన మహేష్‌కే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. పోతిన మహేష్ సైతం మహాధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా టికెట్ విషయమై పోతిన మహేష్ జనసేన అధిష్టానానికి చిన్నసైజు వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తనకు టికెట్ ఇస్తానని ఇంటికి పిలిచి మరీ చెప్పారని పోతిన మహేష్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటలతో ప్రతి డివిజన్‌లో జనసేన కార్యాలయాలు ప్రారంభించామని చెప్పారు. అయితే ఇప్పుడు పొత్తుల పేరుతో బీజేపీకి సీటు ఎలా ఇస్తారని పోతిన మహేష్ ప్రశ్నించారు.
" పవన్ కళ్యాణ్ ఇంటికి పిలిచి మరీ టికెట్ ఇస్తానని చెప్పారు. నా ఫ్యామిలీ మొత్తం ప్రచారం చేసింది. చివరకు ఇప్పుడేమో బీజేపీకి టికెట్ అంటున్నారు. పొత్తు పేరుతో బీజేపీకి ఎలా ఇచ్చారు? గెలిచే సీటు తీసుకెళ్లి వాళ్లకి ఎలా ఇస్తారు? మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతంలో బీజేపీ గెలుస్తుందా?" అని పోతిన మహేష్ ప్రశ్నించారు. విజయవాడ వెస్ట్ టికెట్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేసిన పోతిన మహేష్.. సీటిస్తే గెలిచి గిఫ్ట్ ఇస్తానని అన్నారు. లేదంటే పవన్ కళ్యాణ్ ఫోటోతో ఎన్నికల బరిలోకి దిగుతానని స్ఫష్టం చేశారు.