ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీచేయనున్న అభ్యర్థుల జాబితా వెల్లడైంది. మొత్తం 175 అసెంబ్లీ, 24 ఎంపీ సీట్లకు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. సామాజిక వర్గాల సమీకరణాలకు పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళానేతలకు పెద్దపీట వేశారు. అయితే ఈ క్రమంలో జగన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతుండగా.. కూటమి తరుఫున కీలక నేతలు బరిలో ఉంటున్నారు. టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు.
అయితే ఈ ముగ్గురు నేతలపై మహిళలను బరిలో నిలుపుతున్నారు వైఎస్ జగన్. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ మీద మహిళా అభ్యర్థులను వైసీపీ తరుఫున పోటీకి నిలబెడుతున్నారు. నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీఎన్ దీపికను వైసీపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు పోటీగా మంగళగిరిలో లావణ్యను బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించారు. మొత్తం 19 మంది మహిళలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించిన జగన్.. కీలక నేతలపై మహిళా అభ్యర్థులను బరిలో నిలపడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి నందమూరి బాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ జగన్ హవా సాగిన 2019 ఎన్నికల్లోనూ బాలకృష్ణ ఇక్కడ గెలుపొందారు. టీడీపీకి కంచుకోట లాంటి హిందూపురంలో ఈసారి వైసీపీ వ్యూహాత్మకంగా మహిళను బాలకృష్ణకు పోటీగా బరిలోకి దింపుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీకి ఓటమనేదే లేదు. బాలకృష్ణ సైతం వరుసగా రెండు సార్లు గెలుపొందారు. అయితే హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు మహిళా అభ్యర్థులెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ పార్టీ కూడా ఓ మహిళా నేతను అభ్యర్థిగా బరిలో నిలపలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళా నేతకు వైసీపీ అవకాశం ఇచ్చినట్లు తెలిసింది.
ఇక పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వంగాగీతకు వైసీపీ అవకాశం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మీదకు కాపు నేతను, అందులోనూ మహిళను బరిలోకి దింపితే కాపు సామాజికవర్గం ఓట్లతో పాటుగా .. మహిళల ఓట్లు కలిసి వస్తాయని వైసీపీ ఆలోచన. అందుకే గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వంగా గీతకు ఛాన్స్ ఇచ్చింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుఫున వంగా గీత గెలుపొందారు.
ఇక నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి మురుగుడు లావణ్యను వైఎస్ఆర్‌సీపీ బరిలోకి దింపుతోంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురే మురుగుడు లావణ్య. అలాగే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు కూడా కావటం విశేషం. కాండ్రు కమలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
2004 నుంచి 2009 వరకు మంగళగిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన కాండ్రు కమల.. కాంగ్రెస్‌పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక మురుగుడు హనుమంతరావు విషయానికి వస్తే 1987లో మంగళగిరి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అలాగే 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్ఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. రెండు రాజకీయ కుటుంబాలకు చెందిన లావణ్యకు.. కుటుంబ నేపథ్యం, బీసీ కార్డు ఉపయోగపడుతుందనే కారణంతో వైసీపీ ఎంపిక చేసినట్లు తెలిసింది.