ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. నామినేషన్లు, ఫలితాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2024, 07:41 PM

 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతోపాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు వెలువరించింది. నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 25వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4వ తేదీ ఫలితాలు వెల్లడికానున్నాయి.


ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ముఖ్య తేదీలు


నోటిఫికేషన్ జారీ 18-04-2024


నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 25-04-2024


నామినేషన్ల పరిశీలన 26-04-2024


ఉపసంహరణకు చివరి తేదీ 29-04-2024


పోలింగ్ తేదీ 13-05-2024


ఓట్ల లెక్కింపు 04-06-2024


2019లోనూ సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఒకే విడతలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. కిందటిసారి సార్వత్రిక ఎన్నికలకు 2019 మార్చి 18న నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి విడతలోనే ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. నామినేషన్ల దాఖలుకు మార్చి 25వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. మార్చి 26వ తేదీన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం చేపట్టారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి28వ తేదీ వరకూ ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఏప్రిల్ 11వ తేదీ ఎన్నికల పోలింగ్ జరగ్గా.. కౌంటింగ్ ఏప్రిల్ 23వ తేదీ జరిగింది.


ఇక అప్పటి ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ 151 చోట్ల గెలుపొందింది. టీడీపీ 23 చోట్ల, జనసేన ఒక్క చోట గెలుపొందాయి. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ఒక్కచోట కూడా విజయం సాధించలేదు. ఏపీలో 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వైసీపీ 22 స్థానాల్లో, టీడీపీ మూడు చోట్ల గెలుపొందాయి, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఎంపీసీట్లలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది.


2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతుండగా.. అధికార వైసీపీ మాత్రం ఒంటరిగా ఎన్నికలకు వెళ్తోంది. ఇప్పటివరకూ వైసీపీ నుంచి 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అటు కూటమి తరుఫున టీడీపీ 128 స్థానాలకు, జనసేన ఏడు స్థానాలకు ఇప్పటి వరకూ అభ్యర్థులను ప్రకటించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com