కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు 26 శాసన సభ స్థానాలకు ఉపఎన్నికలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా.. జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తొలి విడతలోనే ఎన్నికలు నిర్వహించగా.. ఈసారి కూడా అలాగే నిర్వహించొచ్చని భావించారంతా. కానీ అనూహ్యంగా ఏపీతోపాటు తెలంగాణలో నాలుగో విడతలో.. మే 13న ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ ప్రకటించింది.
2014లో ఏకంగా 9 దశల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 30, ఏడో విడతలో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరగ్గా.. వారం రోజుల తర్వాత మే 7న ఆంధ్రా ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పుడు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈసారి కూడా తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావించిన వైఎస్సార్సీపీ నాయకత్వం.. ఒకే విడతలో ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తే.. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లు తెలంగాణతోపాటు ఆంధ్రాలోనూ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అలా కాకుండా ఒకేసారి నిర్వహిస్తే.. ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటేసే వీలు ఉంటుంది. దొంగ ఓట్లను అరికట్టేందుకు తెలుగు రాష్ర్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరపాలని విజయసాయి రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది. వైసీపీ అభ్యర్థనకు సానుకూలంగా అన్నట్టుగా ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరిగేలా షెడ్యూల్ ప్రకటించింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నాలుగో విడతలో జరగడం టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి ఉపకరించే అవకాశం ఉంది. అధికార వైఎస్సార్సీపీతో అభ్యర్థుల ప్రకటన సహా.. ఎన్నికలకు సంబంధించిన అన్ని వ్యహారాల్లోనూ ముందంజలో ఉంది. జగన్ పార్టీతో పోలిస్తే కూటమి వెనుకంజలో ఉంది. నాలుగో విడతలో ఎన్నికలు జరగనుండటంతో.. పోలింగ్ తేదీకి సుమారు రెండు నెలల సమయం ఉంటుంది. దీంతో ఈ సమయంలో కూటమి జోరు పెంచే వీలుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. తొలి విడతలో ఎన్నికలు ఉంటే.. పోలింగ్ తేదీకి నెల రోజుల గడువే ఉంటుంది. ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో.. అభ్యర్థులు కంటి మీద కునుకు లేకుండా శ్రమించాల్సి ఉంటుంది. కానీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి, అనుచరగణాన్ని తమ వెంట తిప్పుకోవడానికి అభ్యర్థులు నెల రోజులపాటు ఖర్చు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అభ్యర్థులకు ప్రచారం చేసుకోవడానికి దొరికే సమయంతోపాటు చేసే ఖర్చు సైతం పెరిగే అవకాశం ఉంది.