ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విచిత్రం.. తోకతో పుట్టిన చిన్నారి.. ఆశ్చర్యపోయిన డాక్టర్లు

national |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2024, 10:51 PM

సాధారణంగా మనుషులకు తోకలు ఉండవు. జంతువులు మాత్రమే తోకలతో జన్మిస్తాయి. అప్పుడప్పుడూ కొందరు శిశువులు పుట్టగానే వారికి తోకలు ఉండటాన్ని డాక్టర్లు గమనించినట్లు మనం వార్తల్లో చూశాం. ఇప్పుడు కూడా అచ్చం అలాంటి సంఘటనే జరిగింది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన ఓ గర్భిణీకి డాక్టర్లు సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం బిడ్డను బయటికి తీసిన డాక్టర్లు ఆ శిశువుకు తోక ఉండటం చూసి అవాక్కయ్యారు. ఈ విచిత్ర సంఘటన చైనాలో చోటు చేసుకుంది.


చైనాలోని హాంగ్‌జౌ ప్రావిన్స్‌లోని ఓ హాస్పిటల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. నెలలు నిండిన గర్భిణీకి ఆపరేషన్ చేసిన డాక్టర్లు శిశువును బయటికి తీశారు. అప్పుడే ఆ శిశువుకు తోక ఉన్నట్లు గుర్తించారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తోక ఉండడాన్ని డాక్టర్లు గమనించి ఆశ్చర్యపోయారు. చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ న్యూరోసర్జరీ డిప్యూటీ చీఫ్ ఫిజిషియన్ డాక్టర్ లీ.. శిశువు పుట్టిన కొద్దిసేపటికే ఈ పరిస్థితిని గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియోను ఆయన షేర్ చేశారు. అప్పుడే పుట్టిన శిశువుకు వెనుక వైపున వీపు కింది భాగంలో తోక ఉండటాన్ని చూపిస్తూ ఆ వీడియోను పంచుకున్నారు.


ఇది అసంపూర్ణమైన క్షీణత వల్ల వచ్చిందని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించి ఆ తోకకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించారు. వెన్నుపాము చుట్టూ ఉన్న కణజాలాలతో ఆ తోక అనుసంధానం అయి ఉందని గుర్తించారు. అయితే తోక సాధారణంగా వెన్నెముక అడుగుభాగంలో ఉంటుందని పేర్కొన్నారు. మృదువుగా ఉండి ఎముకలు లేకుండా ఉన్న ఆ తోక సుమారు 10 సెంటీ మీటర్లు అంటే 3.9 అంగుళాల పొడవు ఉందని తెలిపారు. అయితే ఆ తోక వివిధ నాడీ సంబంధ వ్యవస్థలకు హాని కలిగిస్తుందని డాక్టర్లు తెలిపారు.


అయితే ఆ తోకను తొలగించాలని శిశువు తల్లి, కుటుంబ సభ్యులు డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే తోకను తొలగించడం సాధ్యం కాదని.. అందుకే ఆ తోక శిశువుకు అలాగే ఉంటుందని డాక్టర్లు వెల్లడించారు. ఆ తోక శిశువు నాడీ వ్యవస్థతో సంబంధం కలిగి ఉందని.. అందుకే శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆ తోకను అలాగే ఉంచాలని వైద్యులు నిర్ణయించుకున్నారు ఈ ఘటన గత ఏడాది దక్షిణ అమెరికాలోని గయానాలో నమోదైన ఓ కేసును గుర్తు చేస్తుందని చైనా డాక్టర్లు తెలిపారు. గత ఏడాది జూన్‌లో ఓ మగ శిశువు తోకతో జన్మించాడు. అయితే ఆ శిశువు జన్మించిన 10 రోజుల తర్వాత ఆ తోకను శరీరం నుంచి విజయవంతంగా తొలగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com