రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు కాస్తాయనేది పెద్దలు చెప్పేమాట. ఆ రోహిణి కార్తె మామూలుగా మే నెలలో వస్తుంటుంది. కానీ ఈసారి మే రాకముందే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సూర్యుడి బ్యాటింగ్‌కు మార్చి నెలలలోనే ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 వరకూ చేరుకున్నాయి. ఇక ఏపీలోని రాయలసీమ ప్రాంతాల్లో భానుడి భగభగలు మామూలుగా లేవు. ఉక్కపోతకు జనం బెంబేలెత్తిపోయారు. ఇప్పుడే ఇలా ఉంటే మేలో పరిస్థితి ఏంటిరా దేవుడా అంటూ భయపడిపోయారు. అయితే ఏపీవాసులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ వారంలో ఏపీలోని పలు జిల్లాలో వానలు కురవనున్నాయి. వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ఏపీవాసులకు ఈ వార్త కాస్త చల్లబరుస్తోంది.
ఝార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకూ ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాలలో బుధవారం వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలలో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని.. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాలలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
మరోవైపు మండే ఎండలతో సతమతమవుతున్న ఏపీ ప్రజలు వాతావరణ శాఖ నుంచి అందిన వార్తతో కాస్త ఛిల్ అవుతున్నారు. ఎండల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. అటు తెలంగాణలోనూ ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం హైదరాబాద్‌లోని మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాజధానిలో వాతావరణ కాస్తా చల్లబడింది .