రష్యాలో నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి గెలిచి పీఠాన్ని దక్కించుకున్నారు. రష్యాను ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తూ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ క్రమంలోనే మరో 6 ఏళ్ల పాటు రష్యాకు అధ్యక్షుడిగా ఉండనున్నారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా భారత్, రష్యాల మధ్య ప్రస్తుతం ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు పుతిన్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా పుతిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఎన్నిక కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనందుకు పుతిన్‌కు శుభాకాంక్షలు అని చెప్పారు. రాబోయే రోజుల్లో భారత్ - రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు పుతిన్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.
మరోవైపు.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా పుతిన్‌కు అభినందనలు తెలిపారు. పుతిన్ మళ్లీ రష్యా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చూస్తుంటే.. రష్యా ప్రజల నుంచి ఆయనకు అందుతున్న సపోర్ట్ స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆ దేశంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొనేందుకు, రష్యా స్థిరమైన అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేందుకు ఇటీవలి కాలంలో రష్యా ప్రజలు అంతా ఏకమయ్యారని జిన్‌పింగ్ వెల్లడించారు. పుతిన్ నాయకత్వంలో రష్యా మరిన్ని విజయాలు సాధిస్తుందని తాను ఆశిస్తున్నానని.. రష్యా - చైనా దేశాల బంధానికి తాము అత్యంత ప్రాముఖ్యతను ఇస్తామని చెప్పారు.
రష్యాలో అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. శుక్రవారం ప్రారంభమైన రష్యా అధ్యక్ష ఎన్నికలు ఆదివారంతో ముగియగా.. కౌంటింగ్ నిర్వహించగా.. ముందు నుంచీ అంతా ఊహించినట్లుగానే ప్రస్తుత అధ్యక్షుడు 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ రష్యాకు తిరుగులేని నాయకుడిగా నిలిచారు. 3 రోజుల పాటు జరిగిన ఎన్నికల్లో పుతిన్ భారీ విజయాన్ని నమోదు చేశారు. సుమారు 87 శాతం ఓటింగ్ సాధించి మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలవడంతో మరో 6 ఏళ్ల పాటు రష్యాను పాలించనున్నారు. గత 24 ఏళ్లుగా రష్యాలో పుతిన్ అధికారంలో ఉన్నారు. ఇందులో ముందుగా రష్యాకు ప్రధానమంత్రిగా పనిచేసిన పుతిన్.. ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ప్రస్తుతం గెలిచిన పుతిన్.. ఈ 6 ఏళ్ల పాటు రష్యా అధ్యక్ష పదవిలో కొనసాగితే.. రష్యాను ఎక్కువ కాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు.