ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు షాక్ ఇచ్చిన వదిన సీతా సోరెన్

national |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2024, 10:45 PM

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఈడీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న హేమంత్ సోరెన్‌.. తన పదవిని చంపై సోరెన్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు సొంత కుటుంబం నుంచే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కుటుంబంలో అసంతృప్తిగా ఉన్న హేమంత్ సోరెన్ వదిన, జేఎంఎం ఎమ్మెల్యే.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరడం ప్రస్తుతం జార్ఖండ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పటికే బీజేపీ హై కమాండ్.. జార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తోందని.. అక్కడి అధికార పార్టీ ఆరోపిస్తుండగా.. తాజాగా ఆమె వదిన సీతా సోరెన్‌ను కాషాయ పార్టీలో చేర్చుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శిబు సోరెన్‌కు సీతా సోరెన్ పెద్ద కోడలు.


సీతా సోరెన్ దుమ్కా జిల్లాలోని జామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు జేఎంఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత జార్ఖండ్ సీఎంగా తాను పీఠంపై కూర్చోవాలని సీతా సోరెన్ చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అవేమీ పారకుండా శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడు, సీనియర్ జేఎంఎం నేత చంపై సోరెన్.. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో కుటుంబంతోపాటు గత కొంత కాలంగా జేఎంఎం పార్టీలో సీతా సోరెన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.


ఈ క్రమంలోనే జేఎంఎం పార్టీలోని అన్ని ప‌ద‌వుల‌కు మంగ‌ళ‌వారం సీతా సోరెన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తన మామ, జేఎంఎం వ్యవస్థాపక అధ్యక్షుడు శిబు సోరెన్‌కు పంపించారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్. 2009 లో 39 ఏళ్ల వ‌య‌సులో దుర్గా సోరెన్ మ‌ర‌ణించారు. అయితే తన భ‌ర్త చనిపోయిన తర్వాత త‌నను, తన కుటుంబాన్ని అగౌర‌వ‌ప‌రిచే విధంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని రాజీనామా లేఖ‌లో సీతా సోరెన్ ఆవేద‌న వ్యక్తం చేశారు. పార్టీ స‌భ్యులు, కుటుంబం త‌మ‌ను వేరు చేసే విధంగా వ్యవ‌హ‌రించ‌డం త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌ని.. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సీతా సోరెన్ పేర్కొన్నారు.


అయితే ఇటీవల హేమంత్ సోరెన్.. జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేయడం.. ఆ వెంటనే అరెస్ట్ కావడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలోనే అధికార కూటమిని విచ్ఛిన్నం చేసి.. బీజేపీ జార్ఖండ్ సీఎం కుర్చీని లాక్కోవాలని ప్రయత్నించిందని జేఎంఎం నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ సీతా సోరెన్ బీజేపీలో చేరడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com