ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య కోసం స్టార్ హీరో ప్రచారం.. ఆయన సినిమాలు, యాడ్‌లు బ్యాన్ చేయాలని ఫిర్యాదు

national |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 10:51 PM

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో సందడి మొదలైంది. ప్రధాన పార్టీలు ఆయా రాష్ట్రాల్లో సినిమా సెలబ్రిటీలను, వారి కుటుంబ సభ్యుల్ని పోటీకి దించాయి. కర్ణాటకలో కూడా ఎన్నికల్లో సినిమా గ్లామర్ కనిపిస్తోంది. కర్ణాటకలో హీరోలపై ప్రచారంపై బీజేపీ అభ్యంతరం చెబుతోంది. భార్య తరపున ప్రచారం చేస్తున్న స్టార్ హీరో సినిమాలు బ్యాన్ చేయాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరింది.


ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ సతీమణి గీత శివమొగ్గలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్నారు. ఆమె తరఫున శివరాజ్‌కుమార్ ప్రచారానికి సిద్ధమయ్యారు. దీంతో రాజ్‌కుమార్ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్‌లపై నిషేధం విధించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.. భార్య తరఫున ప్రచారం చేస్తున్న స్టార్ హీరో సినిమాలు బ్యాన్ చేయాలని కోరింది. ఈ మేరకు బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్ రఘు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. శివరాజ్‌కుమార్ సినిమాలు ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతాయని ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ముగిసేదాకా ఆయన సినిమాలు, ప్రచారాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.


శివరాజ్‌కుమార్ రాష్ట్రంలో ప్రజాదరణ కలిగిన వ్యక్తి అంటోంది బీజేపీ. ప్రస్తుతం కాంగ్రెస్ కోసం రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారం చేస్తున్నారని... తనదైన ప్రజావ్యక్తిత్వం, నటించిన సినిమాల ద్వారా ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపగలరన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే ఆయన హక్కును గౌరవిస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాల వేదిక కల్పించాలి అని అభిప్రాయపడ్డారు. అనవసరమైన ప్రయోజనాలు, ప్రభావాలను అరికట్టడం అవసరం ఉందన్నారు.


లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు శివరాజ్‌కుమార్‌ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్‌లను ప్రదర్శించకుండా సినిమా హాళ్లు, టీవీ ఛానెల్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ లేఖను పరిశీలిస్తున్నట్లు కర్ణాటక సీఈవో తెలిపారు. శివరాజ్‌కుమార్‌ నటించిన చివరి కన్నడ చిత్రం కరటక దమనక మార్చి 8న విడుదలైంది. శివమొగ్గలో బీజేపీ నుంచి మాజీ సీఎం యడియూరప్ప తనయుడు, సిట్టింగ్‌ ఎంపీ బీవై రాఘవేంద్ర పోటీ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa