ఒంటిమిట్ట మండలంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య పట్ల పలు సందేహాలు కలుగుతున్నాయని.. వైసీపీ నాయకులు చేస్తున్న భూ దందాలకు పేదలు బలైపోతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. చేనేత కార్మికుడి కుటుంబానికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి మీద హక్కులు లేకుండా చేశారని మండిపడ్డారు. ఆ కుటుంబానికి చెందిన ఆస్తి వైసీపీ నాయకుల పేరు మీదకు ఎలా మారిపోయిందని ప్రశ్నించారు. సామూహిక మరణాలకు కారకులెవరో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలకులు ప్రజల ఆస్తులు హస్తగతం చేసుకొనేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చిందని విమర్శించారు. అంతే కాదు ఆస్తుల రిజిస్ట్రేషన్ తరవాత కనీసం దస్తావేజులు కూడా ఇవ్వకుండా కేవలం ఫోటోస్టాట్ కాపీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం కూడా వైసీపీ భూదందా కుట్రలో భాగమే అనిపిస్తోందన్నారు. అధికార పదవుల్లోని ముఖ్య నాయకులు భారీగా దోచేస్తుంటే స్థానికంగా ఉన్న నాయకులు పేదల భూములు గుంజేస్తున్నారని, వాటిని చట్టపరంగా చేసేందుకే చట్ట సవరణలు, కొత్త చట్టాలు తీసుకొచ్చారని ఆరోపించారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంతోపాటు.. భూ దందాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.