విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో బస్టాండ్‌లో పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. మద్యంసేవించి బస్టాండ్‌లోని బెంచీలు ఆక్రమించుకుని యాచకులు, బ్లేడ్ బ్యాచ్ గ్యాంగ్ పడుకుంటోంది. ప్రయాణికుల ఫిర్యాదుతో బస్టాండ్ నుంచి పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. బస్టాండ్‌లో పడుకున్న వారిని నిద్రలేపడాన్ని నిరసిస్తూ సిబ్బందిపై యాచకులు, బ్లేడ్ బ్యాచ్ గ్యాంగ్ దాడి చేశారు. ఒక్కసారిగా పొలీసులపైకి దాడికి వచ్చినవారు వందమందికిపైగా యాచకులు, బ్లేడ్ బ్యాచ్ యువకులు ఉన్నారు. బ్లేడ్‌లతో దాడికి యత్నించడంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు. దాడిలో సాంబయ్య అనే ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి గాయాలయ్యాయి. బస్టాండ్‌లోని ఆర్టీసీ విచారణ సిబ్బందిపై కూడా యాచకులు దాడికి యత్నించారు. అదనపు పోలీసులు రావడంతో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ యువకులు పరారయ్యారు. దాడికి పాల్పడిన వారిలో కొందరు బ్లేడ్ బ్యాచ్ యువకులు, యాచకులను పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా బస్టాండ్ నుంచి తమను బయటకు పంపడాన్ని నిరసిస్తూ యాచకులు, బ్లేడ్ బ్యాచ్ యువకులు ఆందోళనకు దిగారు.