తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఒంగోలు జిల్లా పర్యటన షెడ్యూల్లో మార్పు జరిగింది. తొలుత ఈనెల 31న జిల్లాలోని మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాలలో ప్రజాగళం పేరుతో ఆయన పర్యటించేలా నిర్ణయించారు. అయితే తాజాగా ఆ షెడ్యూల్ను మార్చారు. ప్రస్తుతం జిల్లా నేతలకు అధిష్ఠానం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 31న చంద్రబాబు కార్యక్రమం మార్కాపురం వరకే పరిమితం కానుంది. ఆరోజు ఉదయం నెల్లూరు జిల్లా కావలిలో జరిగే సభలో పాల్గొనే చంద్రబాబు అనంతరం హెలికాప్టర్లో మార్కాపురం చేరుకొని అక్కడ ఏర్పాటు చేసే సభలో ప్రసంగిస్తారు. అనంతరం బాపట్ల జిల్లాకు వెళ్తారు. ఆ జిల్లాలోని రేపల్లె, బాపట్లలో జరిగే సభల్లో పాల్గొంటారు.