విశాఖ క్రికెట్ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు బుధవారం ఉదయం పది గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్ వెబ్‌సైట్ ద్వారా ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్ 31వ తేదీన స్థానిక ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్నది. టికెట్ల ధరలు రూ.1,000, రూ.1,500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.5,000, రూ.7,500గా నిర్ణయించారు. విశాఖలో జరిగే ఇంటర్నేషనల్ వన్డే, టీ-20 మ్యాచ్‌లకు ఆన్‌లైన్‌లో కాకుంటే ఆఫ్‌లైన్ ద్వారానైనా టికెట్ పొందేందుకు అవకాశం ఉండేది. కానీ, ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు కేవలం ఆన్‌లైన్‌కు మాత్రమే పరిమితం చేశారు. ఈనెల 31వ తేదీన జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడనుండడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం, రానున్న ఐపీఎల్ సీజన్‌లో ఆడే అవకాశాలు తక్కువగా ఉండడం, దాదాపు ఐదేళ్ల తర్వాత విశాఖలో ఆడనుండడం, పైగా చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్‌లో బలమైన జట్టు కావడం వంటి అనేక కారణాలు మ్యాచ్‌పై క్రేజ్‌ను పెంచాయి. అయితే అమ్మకానికి ఎన్ని టికెట్లు అందుబాటులో పెడుతున్నారనే లెక్కలను నిర్వాహకులు వెల్లడించలేదు. స్టేడియం సామర్థ్యం 25 వేలు కాగా అందులో ఎన్ని టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మబోతున్నారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ మ్యాచ్ టికెట్లను ఇప్పటికే బ్లాక్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.