పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించటంపై రెండ్రోజులుగా తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అసంతృప్తి జ్వాలలు చల్లారలేదు. సోమవారం కార్యకర్తల సమావేశంలో సామూహిక రాజీనామాలు చేస్తామని హెచ్చరించిన నేతలు మంగళవారం ఉదయం సమావేశమై పార్టీకి తమ రాజీనామాలను సమర్పించారు. నియోజకవర్గం నుంచి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గెలిచే అభ్యర్థి అని, కనీస సంప్రదింపులు లేకుండా జనసేన పార్టీకి సీటు కేటాయించటం పట్ల వారు నిరసన తెలియజేస్తూ రాజీనామా ప్రతులను పార్టీ కార్యాలయానికి పంపించారు. జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు నేతృత్వం వహించగా, నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతలు యాసం చిట్టిబాబు, కర్రా సుధాకర్, పండ్రాజు లంకమ్మ ప్రసాద్, బండే కనకదుర్గ, మాదివాడ లక్ష్మీ తులసి, అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, ఘంటసాల రాజమోహనరావు తదితరులు పాల్గొన్నారు.