విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ నియమితులయ్యారు. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నియామక ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షునిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. పల్లా శ్రీనివాసరావు సుమారు నాలుగేళ్లు అధ్యక్ష పదవిలో కొనసాగారు. గండి బాబ్జీ మూడేళ్లుగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. అయితే, పొత్తులో భాగంగా ‘సౌత్’ సీటు జనసేనకు దక్కింది. ఈ నేపథ్యంలో బాబ్జీకి సముచిత స్థానం కల్పించాలని భావించిన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షునిగా నియమించారు. ఉమ్మడి విశాఖ జిల్లా సబ్బవరం మండలం మొగలిపురం గ్రామానికి చెందిన గండి బాబ్జీ బీఎల్ పట్టభద్రులు. తొలుత కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పలు పదవులను అలంకరించిన తరువాత 2004లో పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రెండు పర్యాయాలు అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2016లో తెలుగుదేశం పార్టీలో చేరిన బాబ్జీకి 2020లో విశాఖ దక్షిణ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో కేడర్‌ను సమన్వయం చేస్తూ ప్రభుత్వ విధానాలపై పోరాటాన్ని సాగించారు. ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ.. ఈ సీటును జనసేనకు కేటాయించాల్సి వచ్చింది.