పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. ఇందుకోసం కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు బయలుదేరారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ ‘సిద్ధం’ సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంట్ స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం వైయస్ జగన్ మమేకమవుతారు.