ఏపీలో ఎండల తీవ్రత పెరిగింది. వాతావరణ మార్పుల కారణంగా మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. శుక్రవారం రాయలసీమ, ఉత్తర కోస్తాలోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. కడప జిల్లా ముద్దనూరులో తీవ్ర వడగాలి వీచింది. అనంతపురం, కర్నూలు, తిరుపతి, కావలి, తుని, నంద్యాల తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగాయి. రాబోయే రెండురోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఏర్పడవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశముందని తెలిపింది. శనివారం రాష్ట్రంలోని 50 మండలాల్లో, ఆదివారం 56 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, వైయస్‌ఆర్ జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతుందని పేర్కొంది. శుక్రవారం అత్యధికంగా ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సొసైటీ (ఏపీఎస్‌డీపీఎస్) వెబ్‌సైట్లో పేర్కొన్నారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మధ్యా హ్నం ప్రజలకు బయటకు రాకూడదని, వేడిగాలులకు గురి కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా ప్రజలు టోపీలు, గొడుగులు ధరించాలని, ఎక్కువ శాతం నీరు, మజ్జిగ వంటి పానియాలు తాగుతూ వడదెబ్బకు గురి కాకుండా చూసుకోవాలని వైద్యులు సూచించారు. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడం మంచిది అంటున్నారు.