ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు ఎన్నో ఎత్తుగడలు వేస్తుంటాయి. ముఖ్యంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంపిణీ చేయడం, మహిళలకు చీరలు, కుంకుమభరణిలు, పలు వస్తువులను ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తు్ంటారు. అయితే పోలీసులు మాత్రం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు చోట్ల భారీగా నగదును పట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా పామర్రులు పెద్ద మొత్తంలో చీరల బండిల్స్‌ను పోలీసులు గుర్తించారు. పామర్రు మండలం పెరిశే పల్లిలో ఓ ఇంట్లో భారీగా చీరలను పోలీసులు కనుగొన్నారు. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన ఓ పార్టీకి చెందిన చీరలుగా గుర్తించారు. పట్టుబడిన చీరల విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని.. మొత్తం 46 బండిల్స్ చీరలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో చెరుకూరి వెంకన్న ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా పెద్ద మొత్తంలో చీరల బండిల్స్ పట్టబడ్డాయి. చీరలను సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.