కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన సీనియర్ నటి, ఎంపీ సుమలత అంబరీష్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఇండిపెండెంట్ ఎంపీగా ఉన్న సుమలత అంబరీష్.. త్వరలోనే బీజేపీ గూటికి వెళ్లనున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే తన అభిమానులు, నియోజకవర్గ సహచరులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించిన సుమలత.. ఈ ప్రకటన చేశారు. గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆమె బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో ఆమె త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే ఎలాంటి ప్రకటన చేయని సుమలత అంబరీష్.. తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు.
ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సుమలత అంబరీష్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా.. సుమలత సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాండ్య నియోజకవర్గంలో జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే మాండ్య బీజేపీ-జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామికి మద్దతు తెలుపుతున్నట్లు సుమలత అంబరీష్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన మాండ్య నియోజకవర్గాన్ని వీడనని స్పష్టం చేశారు. మాండ్యా నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయడం భవిష్యత్‌లో చూస్తారని తెలిపారు.
ఇక ఈ సందర్భంగానే బీజేపీ సర్కార్‌పై ప్రశంసలు కురిపించారు. మాండ్యలో తాను ఇండిపెండెంట్ ఎంపీని అయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గానికి రూ.4 వేల కోట్ల గ్రాంట్లు ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. బీజేపీకి తన అవసరం ఉందని.. ఆ పార్టీని వదులుకోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరారని.. అలాంటి వ్యక్తి చెప్పిన గౌరవించాలి కదా అందుకే బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. ఇక తనను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని.. అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. తాను మాండ్య జిల్లాకు కోడలిని అని.. తాను ఇక్కడే ఉంటానని పేర్కొన్నారు.
తన మద్దతుదారులు కొందరు కాంగ్రెస్‌లో చేరాలని తనకు సూచించారని.. అయితే తాను ఆ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెస్‌కు సుమలత అవసరం ఇప్పుడు లేదు.. ఇకపై రాదు అంటూ ఓ సీనియర్ కాంగ్రెస్ నేత అన్నారని.. అలా అన్న తర్వాత కూడా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తిగా తాను ఆ పార్టీలోకి ఎలా వెళ్తానని సుమలత హస్తం పార్టీపై మండిపడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాండ్య నుంచి బరిలోకి దిగిన సుమలత అంబరీష్.. బీజేపీ మద్దతు ఇవ్వడంతో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ను ఓడించారు. ఈ నెల 6 వ తేదీన తాను బీజేపీలో చేరుతున్నట్లు సుమలత ప్రకటించారు. ఎన్నికల తర్వాత సుమలతకు బీజేపీ మంచి పదవి.. హోదా కల్పిస్తామని హైకమాండ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.