చాలా అత్యాచార ఘటనలు వెలుగులోకి రావు. ఒకవేళ ఇలాంటి విషయాలని బయటికి చెబితే సమాజంలో పరువు పోతుందని.. కుటుంబంలో అవమానాలు ఎదురవుతాయని.. ఎంతో మంది మహిళలు ఆ విషయాన్ని చెప్పడానికి ముందుకు రారు. ధైర్యం చేసి ముందుకు వచ్చినా.. న్యాయం జరుగుతుందో లేదో అని భయపడుతూ ఉంటారు. తమకు జరిగిన ఆ భయంకర సంఘటనను తమలోనే దాచుకుంటూ ఎంతో మంది మహిళలు నిత్యం కుమిలిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే నిపుణులు, పోలీసులు.. ధైర్యంగా మహిళలు బయటికి వచ్చి ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు చేయాలని.. అలాంటి వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారు. అయితే అలా తన బాధను చెప్పుకుని.. నిందితుడికి శిక్ష విధించాలని కోరేందుకు వచ్చిన ఓ మహిళకు న్యాయస్థానంలోనే అన్యాయం ఎదురైంది.
కోర్టుకు వచ్చిన ఆ బాధితురాలిని బట్టలు విప్పాలని.. ఆ జడ్జి సూచించడంతో ఆమె అవాక్కయింది. ఈ అనూహ్య సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. కరౌలీ జిల్లాలోని హిండౌన్ కోర్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 19 వ తేదీన హిండౌన్‌లో ఓ దళిత మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన నుంచి తేరుకున్న ఆ మహిళ.. మార్చి 27 వ తేదీన హిండౌన్ సదర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే అప్పటికే రేప్ జరిగి తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ఆ మహిళకు కోర్టులో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
మార్చి 30 వ తేదీన హిండౌన్ కోర్టులో బాధిత మహిళ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా హిండెన్ కోర్టు జడ్జి మహిళ పట్ల హద్దులు దాటి ప్రవర్తించాడు. అత్యాచారం జరిగినట్లు గుర్తించేందుకు శరీరంపై ఉండే గాయాలను పరిశీలించేందుకు బట్టలు విప్పాలని ఆ జడ్జి మహిళకు సూచించాడు. దీంతో ఆమె షాక్ అయి.. దుస్తులు విప్పేందుకు నిరాకరించింది. అందరి ముందే తనను బట్టలు విప్పాలని జడ్జి అనడంతో తీవ్ర అవమానంగా భావించింది. అనంతరం మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. ఈసారి ఏకంగా జడ్జిపైనే ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆ జడ్జిపై కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇండియన్ పీనల్ కోడ్-ఐపీసీలోని సెక్షన్ 345తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద హిండౌన్ కోర్టు జడ్జిపై కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎస్టీ, ఎస్టీ సెల్ డిప్యూటీ ఎస్పీ మీనా వెల్లడించారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్తే ఏకంగా న్యాయమూర్తే ఇలా బాధిత మహిళ పట్ల ప్రవర్తించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.