కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పాణ్యం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖర రెడ్డి టీడీపీలో చేరారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాద్‌లో ఆయన ఆ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డితో కలిసి ఆయన చంద్రబాబు వద్దకు వెళ్లారు. బనగానపల్లెలలో బీసీ జనార్దన్‌రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపునకు కృషి చేయాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ అధినేత ఆయనకు సూచించారు. 1994లో టీడీపీ నుంచి తన అన్న కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై (కాంగ్రెస్) పోటీ చేశానని.. తిరిగి సొంతగూటికి చేరినందుకు సంతోషంగా ఉందన్నారు చంద్రశేఖర్ రెడ్డి. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రిలో 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన వీఆర్ రామిరెడ్డి కూడా టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఆయనతోపాటు కుమారుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, మరో కుమారుడు విఘ్నేశ్వర్ రెడ్డి కూడా చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్‌లో టీడీపీలో చేరారు. వారితోపాటు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి కూడా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చి నేతలకు చంద్రబాబు కండువా కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు.