చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల కిందట పెరాలసిస్‌కు గురయ్యాడు. చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న తల్లిదండ్రులకు ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి. అతని వైద్యానికి మరో రూ.15 లక్షలు అవసరం అవుతాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సీఎంను కలిస్తే తప్పక తమకు సహాయం దొరుకుతుందని ముఖేష్ తల్లి నమ్మింది. ఈ నేపథ్యంలో మేమంతా సిద్ధం యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం ముఖ్యమంత్రిని కలిసింది. సీఎం వైయస్ జగన్ వారిని బస్సు వద్దకు పిలిపించుకుని ముఖేష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. ముఖేష్ వివరాలను తీసుకోవాలని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు. వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాతో తమ బిడ్డకు వైద్యం అంది, మామూలు మనిషి అవుతాడనే నమ్మకం కలిగిందని ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.