ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానంటున్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడ విమానాశ్రయం చేరుకున్నారు. పోటీ చేస్తానన్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని.. ఏ పార్టీయో తెలియదు.. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో తెలియదు అన్నారు. మూడు, నాలుగు రోజుల్లో మంచి వార్త వస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి విజయవాడ వచ్చినట్లు తెలిపారు. ఇవాళ నరసాపురం నియోజకవర్గానికి వెళ్లబోతున్నట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వింటున్నానని చెప్పారు.. తానైతే కచ్చితంగా పోటీ చేస్తానని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో కూటమి అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ ప్రకటించిన వెంటనే తన నియోజకవర్గంలో పర్యటిస్తానని రఘురామ కృష్ణం రాజు తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కచ్చితంగా గెలుస్తారని.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. పింఛన్ల విషయంలో పింఛన్‌దారులను సీఎం జగన్ తీవ్ర ఇబ్బందులకి గురి చేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలో 1,50,000 మంది సెక్రటేరియట్ సభ్యులు ఉన్నారని.. ఒక్కొక్క వ్యక్తికి 50 గృహాలు అప్పగిస్తే ఒక్క రోజులో వారందరూ పెన్షన్ ఇచ్చేస్తారని చెప్పారు.ఒక పోస్ట్ మెన్ రోజుకి ఎన్ని ఉత్తరాలు ఇస్తున్నాడో తెలుసుకోవాలన్నారు. కావాలనే పెన్షన్ దారులను ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు మీదకి నెట్టేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడుతూ పెన్షన్ తీసుకున్నారో వారందరి ఉసురు కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగులుతుందన్నారు రఘురామ.
టీడీపీ, బీజేపీ పార్టీలలో ఇటీవల చేరిన వారు జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం మాట దేవుడెరుగు.. కనీసం ఒక్క మాటైనా మాట్లాడినట్టు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తానేదో ఎమోషనల్‌గా చెప్పిన విషయాన్ని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరెన్ని కారు కూతలు కూసినా తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని.. తనకు అలసట అన్నదే లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు నిద్రపోయేది లేదన్నారు. కొంత మంది యూట్యూబర్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అవహేళన చేయాలని చూస్తే సహించేది లేదని ఒకరిద్దరి పేర్లను ప్రస్తావించారు. ఎవరైనా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అవహేళన చేయాలని చూస్తే మాత్రం వారికి తగిన శాస్తి చేయనున్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్‌లో చంద్రబాబుతో సమావేశమైనట్లు చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదే జిల్లా నుంచి ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. వాస్తవానికి ఆయన్ను నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా నిలపాలని టీడీపీ అధినేత గట్టి ప్రయత్నమే చేశారు. అయితే ఆ సీటు పొత్తులో బీజేపీకి వెళ్లింది. తమ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ పేరును ప్రకటించింది. ఆయన్ను మార్చేందుకు సుముఖత చూపలేదని సమాచారం. దీంతో అసెంబ్లీ బరిలో రఘురామరాజును నిలపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.