ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్.. ఇక నో టెన్షన్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 04, 2024, 07:36 PM

ఆంధ్రప్రదేశ్‌‌లో పింఛన్ల పంపిణీ విధానం గందరగోళంగా మారింది. పంపిణీలో చాలా చోట్ల సమస్యలు కనిపించాయి.. సచివాలయాల్లో పింఛనుదారులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వేసవి, వేడి గాలుల తీవ్రత ఉండటంతో నేటి (గురువారం) నుంచి ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛను అందించేలా నిబంధనలు సవరించినట్లు చెప్పారు.


ఈ విభాగాల పింఛన్‌దారులు సచివాలయాలకు రానవసరం లేదని, వారికి ఇంటి వద్దే పింఛను ఇస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ధవారం మధ్యాహ్నం తర్వాత పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని కొత్త మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. తాజా మార్గదర్శకాల గురించి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసినా, ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యే అవ్వాతాతలకు స్పష్టంగా తెలియలేదు. దీంతో లబ్దిదారులు బుధవారం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు చేరుకోవడంతో కొంత గందరగోళం నెలకొందని అధికారులు చెప్పారు.


ఏప్రిల్‌ నెలలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 66 లక్షల మందికి పింఛన్ల పంపిణీ చేయాలి. బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. సచివాలయాల సిబ్బంది పంపిణీ చేశారు..మరో మూడు రోజులు సచివాలయాల వద్ద ఈ పంపిణీ కొనసాగుతుంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్‌ చైర్‌కు పరిమితమైన వారికి తప్పనిసరిగా వారి ఇంటి వద్దనే పంపిణీ చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు. ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని.. వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సచివాలయాల దగ్గరకు రావాల్సిన అవసరం లేదంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఉదయం నుంచే వృద్ధులు పింఛన్‌ కోసం తరలివచ్చారు. లబ్ధిదారులు క్యూలైన్లలో నిల్చుని ఎదురుచూశారు. చాలాచోట్ల సచివాలయాలకు ఇంకా పింఛన్‌ డబ్బు చేరుకోకపోవడంతో లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. 2,3 గంటల పాటు లైన్లలో నిలుచున్న వృద్ధులు ఎండవేడికి తట్టుకోలేక ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు.


మరోవైపు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను కొట్టేసింది. సజావుగా పింఛన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని గుర్తుచేసింది. అనారోగ్యంతో ఇల్లు కదలలేని లబ్ధిదారుల వద్దకే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది వెళ్లి పింఛను అందజేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న మెమో ఇచ్చిందని గుర్తుచేసింది. వాలంటీర్లను పక్కనపెట్టడంతో కార్యాలయాల వద్దకొచ్చి పింఛను అందుకోవడానికి వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారన్న పిటిషనర్‌ వాదనను తోసిపుచ్చింది.


దేశంలో వాలంటీర్‌ వ్యవస్థ లేని మిగిలిన రాష్ట్రాల్లోనూ పింఛన్ల పంపిణీ జరుగుతోంది కదా.. అక్కడ ప్రజలే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకుంటున్నారు కదా అని గుర్తుచేసింది హైకోర్టు. సజావుగా పెన్షన్ల పంపిణీకి ఈసీ తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. వాలంటీర్లపై అందిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని.. ఈసీ వారిని పక్కనపెట్టిందని గుర్తుచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు చెప్పింది. వాలంటీర్లను దూరం పెట్టడంతో తమకు పింఛన్‌ అందడం లేదంటూ కొందరు మహిళలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సైతం ధర్మాసనం కొట్టేసింది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కనపెడుతూ ఈసీ మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామానికి చెందిన వి.వరలక్ష్మి, మరో ఇద్దరు పింఛనుదారులు హైకోర్టులో పిల్‌ వేశారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com