ఆక్వా రైతుల సమస్యలపై త్వరలోనే కచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను మంత్రి దృష్టికి వారు తీసుకు వెళ్లారు. హేచరీలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని మంత్రిని ఈ సందర్భంగా ఆక్వా రైతులు కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. లోడ్ అధికంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. విద్యుత్ సరఫరా అవసరానికి తగినట్లు.. కొత్త సబ్ స్టేషన్లు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ సబ్సిడీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని పలువురు హేచరీల యాజమాన్యాలు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను కొరగా.. దీనిపై మంత్రి వెంటనే స్పందించారు.హేచరీల యాజమాన్యాలతో అధికారులు సమావేశం కావాలని సూచించారు. వారిపై పెను ఆర్థిక భారం పడకుండా సమస్యను పరిష్కరించేందుకు తనకు సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. మరోవైపు ఆక్వా రైతుల సమస్యలపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చించినట్లు మంత్రి వారికి వివరించారు.