నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు - ఈశాన్యంగా 110 కిలోమీటర్లు.. నాగపట్టణానికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, అలాగే పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు.. చెన్నైకి దక్షిణ ఆగ్నేయముగా 480 కిలోమీటర్లు దూరంలో ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైందని తెలిపింది.అయితే ఇది రాగల 12 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం శ్రీలంక తీరాన్ని తాకుతూ ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశముందని పేర్కొంది. ఈ తీవ్ర వాయుగుండం ఈ రోజు సాయంత్రానికి లేదా శుక్రవారం ఉదయానికి తుఫాన్‌గా బలపడే అవకాశముందని చెప్పింది.ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలలో.. కరైకల్, మహాబలిపురం మధ్య నవంబర్ 30వ తేదీ ఉదయం తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. రానున్న 24 గంటలలో తిరుపతి, నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆ క్రమంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.