రైతు సమస్యలను పరిష్కరిస్తూ.. వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ద్వారానే రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందన్నారు. గురువారం గుడివాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకర్లతో మాట్లాడుతూ... శుక్రవారం సాయంత్రం లోపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులెవరు ఆందోళన చందలవలసిన అవసరం లేదని వారికి మంత్రి భరోసా ఇచ్చారు.వాతావరణ మార్పుల కారణంగా 40 రోజులపాటు జరగాల్సిన ప్రక్రియ... నాలుగు రోజుల్లో చేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా.. అధికార యంత్రాంగం అంతా రేయింబవళ్లు కష్టపడుతుందని చెప్పారు. వాతావరణ మార్పులతో రైతులకు మేలు చేకూర్చేలా.. ధాన్యం విక్రయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. ధాన్యం విక్రయాలపై.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.