ఏపీలో ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో ఏపీలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులపై చెప్పడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని అసెంబ్లీలో పెట్టామని గుర్తుచేశారు. ఆ తర్వాత శాసనసభ, శాసన మండలిలోనూ చర్చించామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతి దయనీయమైన పరిస్థితిలో ఉందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.బ్రాండ్ చంద్రబాబు పేరుతో రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతున్నామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రాన్ని ముందుకు నెట్టగలుగుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 99 శాతం ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే సరిపోతుందని అన్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ఏడు శాతం ఎక్కువగా ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.