ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో తిరుమలలో చాలా మార్పులు వచ్చాయని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా గురువారం మంత్రి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో భక్తులు అనేక ఇబ్బందులు పడే వారని.. ప్రస్తుతం సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. తిరుమల్లో గతంలో అనేక వివాదాలు ఉండేవని.. ప్రస్తుతం ఎటువంటి వివాదాలు లేకుండా పరిపాలన సాగుతోందని అన్నారు.తిరుమల ప్రసాదాల నాణ్యత పెరిగిందని భక్తులు ప్రశంసిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రతి నెలా తిరుమలకు వచ్చి భక్తుల సౌకర్యాలు మెరుగుపడ్డాయా లేదా అన్నది పరిశీలిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో 5,400 ఆలయాలకు ధూప దీప నైవేథ్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచామని, మఠాలు, పీఠాలు ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించేలా వుండాలని ఆకాంక్షించారు. మఠాలు వ్యాపారాత్మక దోరణిలో ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.