ఒకప్పుడు అమేథీ అంటే కాంగ్రెస్ పార్టీకి, గాంధీల కుటుంబానికి కంచుకోటగా ఉండేది. ఈ అమేథీ నుంచే సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పలుమార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇలాంటి గాంధీల కంచుకోటగా ఉన్న అమేథీలో కాంగ్రెస్ పార్టీ తరఫున 2019 లో బరిలో ఉన్న రాహుల్ గాంధీని.. బీజేపీ నాయకురాలు, మాజీ సినీ నటి స్మృతి ఇరానీ ఓడించి గాంధీల అడ్డాలో పాగా వేశారు. 1967 నుంచి ఇప్పటివరకు 3 సార్లు మినహాయిస్తే అమేథీలో హస్తం పార్టీ చక్రం తిప్పింది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ మళ్లీ అక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా చర్చ జరిగింది. అయితే కాంగ్రెస్ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో రాహుల్ గాంధీ.. కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. దీంతో గాంధీల కంచుకోట అమేథీని రాహుల్ గాంధీ వదిలిపెట్టినట్లు అయింది.
అమేథీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను అమేథీ నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ప్రత్యర్థిగా బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. 2024 ఎన్నికల్లో కూడా మరోసారి రాహుల్-స్మృతి తలపడతారని భావించినా అది జరగలేదు. ఇక స్మృతి ఇరానీ ఏకంగా అమేథీలోనే ఇల్లు కట్టుకుని అక్కడే స్థిరపడిపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారా అని ఎదురు చూస్తున్న వేళ.. రాబర్ట్ వాద్రాను బరిలోకి దింపాలని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్మృతి ఇరానీని ఎదుర్కోవాలంటే రాబర్ట్ వాద్రానే కరెక్ట్ అని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇటీవల ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన రాబర్ట్ వాద్రా.. తనను అమేథీ నుంచి పోటీ చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో అమేథీలో బరిలో ఉండేది రాబర్ట్ వాద్రా అనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లు అయింది. అయితే ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ విభాగం మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించింది. రాబర్ట్ వాద్రా పేరు అమేథీ లోక్‌సభ నియోజకవర్గం పరిశీలనలో లేదని యూపీ కాంగ్రెస్ కుండబద్ధలు కొట్టింది. ఇక శుక్రవారం కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అమేథీతోపాటు సోనియా గాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసేది ఎవరు అనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇక దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత ఏప్రిల్ 19 వ తేదీన ప్రారంభం కానుండగా.. ఆ తర్వాత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1 వ తేదీన మిగిలిన దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4 వ తేదీన విడుదల చేయనున్నారు. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.