లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని శుక్రవారం విడుదల చేసింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీల పేరుతో విడుదల చేసిన మేనిఫేస్టోలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారెంటీలు అధికారాన్ని తీసుకురావడంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ వాటినే కొనసాగించింది. పాంచ్‌న్యాయ్ పేరిట ఈ హామీలను రూపొందించింది. యువత, మహిళలే లక్ష్యంగా చేసుకుని రూపొందించిన మేనిఫోస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను చేర్చింది.
గత పదేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో.. ఇంధనం ధరలను తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. సైనిక నియామకాల విషయంలో కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. తిరిగి పాత విధానాన్నే కొనసాగిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.
మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపింది. రైతులను ఆకట్టుకోవడం కోసం పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని స్పష్టం చేసింది. అంతే కాకుండా వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు కల్పించే అంశాన్ని సైతం మేనిఫెస్టోలో చేర్చింది.
బిహార్ తరహాలోనే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నిరుద్యోగ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని యువతను తమవైపు తిప్పుకోవడం 30 లక్షల ఉద్యోగాలిస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. రైల్వేల ప్రైవేటీకరణను రద్దు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది.
రూ.5000 కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్, నిరుద్యోగ భృతి ద్వారా జాబ్స్ లేని యువత ఖాతాల్లోకి నగదు బదిలీ, విద్యా రుణాల వడ్డీ రేటు తగ్గింపు, చిన్నతరహా పరిశ్రమల రుణాలను కొంతమేరకు మాఫీ చేసి.. తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ, దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల పంపిణీ వంటి హామీలు గుప్పించింది. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. సంక్షేమంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి ఈ మేనిఫెస్టోను రూపొందించింది. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలు మేనిఫేస్టోను విడుదల చేశారు.
‘దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి... రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న వారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి... ఈ పోరాటం మేము గెలిచిన తర్వాత ప్రజలలో అత్యధికుల ప్రయోజనాలను కాపాడుతాం.. భారత్ 2-3 సమూహాలతోనే నడపదని, అది అత్యధిక మెజారిటీ ప్రజలతో నడుస్తుందని నిర్ధారిస్తుంది. గుత్తాధిపత్య, వ్యాపారాల మధ్య సరసమైన పోటీ ఉన్న దేశం మనది... ఈ ఎన్నికలు ప్రాథమికంగా భిన్నమైనవి. ప్రజాస్వామ్యం ఇంతకంటే ప్రమాదంలో పడిందని నేను అనుకోను.’ అని మేనిఫెస్టో విడుదల తర్వాత కాంగ్రెస్ ట్వీట్ చేసింది.