ఇకపై జనన ధ్రువీకరణ పత్రాల్లో తల్లిదండ్రులు తమ మతం గురించి వ్యక్తిగతంగా నమోదుచేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న ‘కుటుంబ మతం’ స్థానంలో తల్లి, తండ్రి విడిగా తమ మతం గురించి డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ కొత్త నిబంధన కేంద్ర హోంశాఖ నమూనా నిబంధనలకు అనుగుణంగా ఉంది. అయితే, ఇది అమల్లోకి వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసి, వాటి ఆమోదం తప్పనిసరి. దత్తత తీసుకునే తల్లిదండ్రుల కూడా మతాన్ని వ్యక్తిగతంగా నమోదు చేయాలి.
జనన, మరణాల నమోదుకు జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేయనున్నారు. ఆధార్ నంబర్లు, ఆస్తి రిజిస్ట్రేషన్లు, రేషన్ కార్డ్‌లు, ఎలక్టోరల్ రోల్స్, పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR)తో సహా అనేక ఇతర డేటాబేస్‌లను రిఫ్రెష్ చేయడానికి దీనిని సమర్థంగా ఉపయోగించనున్నారు.
గత, వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో జనన మరణ నమోదు (సవరణ) చట్టం బిల్లు 2023కు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. ఆగస్టు 1న లోక్‌సభలోనూ, 7న రాజ్యసభలోనూ ఆమోదించారు. అక్టోబర్ 2023 నుంచి విద్యా సంస్థలలో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్, ఓటు హక్కు, ఆధార్ నంబర్‌ను పొందడం, వివాహాలను నమోదు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడం వంటి వివిధ ముఖ్యమైన సేవలకు జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేశారు.
‘జననాలు, మరణాల డేటాబేస్ రూపొందించడంలో ఇది సహాయపడుతుంది. ప్రజా సేవలు, సామాజిక ప్రయోజనాలు, డిజిటల్ రిజిస్ట్రేషన్‌లో సమర్థవంతమైన, పారదర్శకతకు సహకరిస్తుంది’అని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 (20 ఆఫ్ 2023)లోని సెక్షన్ 1లోని సబ్-సెక్షన్ (2) ద్వారా దఖలుపడిన అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 1 నుంచి చట్టంలోని నిబంధనలు అమల్లోకి వస్తాయని’ అని నోటిఫికేషన్ పేర్కొంది.