కేన్సర్ వ్యాధిపై ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) ఆందోళన వ్యక్తం చేసింది. ఏటా లక్షల మందిని ఈ మహమ్మారి బలితీసుకుంటోంది. ఇక, భారత్ కేన్సర్‌కు రాజధానిగా మారిపోయిందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. కేన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్ (బీపీ), హృద్రోగం, మానసిక సమస్యల వంటి అసాంక్రమిక వ్యాధులు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా కేన్సర్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని, ప్రపంచ కేన్సర్ రాజధానిగా భారత్ తయారైందా? అన్న స్థాయిలో పరిస్థితి ఉందని పేర్కొంది. ‘హెల్త్ ఆఫ్ ది నేషన్’ పేరుతో అపోలో హాస్పిటల్స్ గురువారం విడుదల చేసిన నాలుగో వార్షిక నివేదికలో పలు సంచలన విషయాలు ఉన్నాయి.
చిన్నపిల్లలు పలు అసాంక్రమిక వ్యాధుల బారినపడటం ఇటీవలి కాలంలో పెరిగిపోయిందని, దీనిని నివారించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని నివేదిక సూచించింది. కేన్సర్ విషయంలో కూడా ఇది కనిపిస్తోందని, ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో ఈ వ్యాధి బారినపడుతున్న వారి సగటు వయసు చాలా తక్కువగా ఉంటోందని వివరించింది. దేశంలో రొమ్ము, గర్భాశయం, ఊపిరితిత్తులు, నోటి కేన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతునప్పటికీ, నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం చాలా తక్కువగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. అలాగే, స్థూలకాయం (ఒబిసిటీ) కూడా భారతీయ యువతలో పెరిగిపోతోందని, ఇది పలు అసాంక్రమిక వ్యాధులకు కారణమవుతోందని తెలిపింది.
అంతేకాదు, మధుమేహం, హైపర్ టెన్షన్ (బీపీ)ల ముప్పును పలువురు భారతీయులు ఎదుర్కొంటున్నారని వెల్లడయ్యింది. యువతలో మానసిక సమస్యలు ముఖ్యంగా కుంగుబాటు (డిప్రెషన్) అధికంగా కనిపిస్తోందని తేలింది. ఈ నివేదికపై అపోలో హాస్పిటల్స్ వైస్-ఛైర్మన్ డాక్టర్ ప్రీతా రెడ్డి మాట్లాడుతూ.. అసాంక్రమిక వ్యాధులను ఎదుర్కోవటానికి తక్షణం సమష్టి కార్యాచరణ అవసరమని అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచటంతోపాటు వ్యక్తిగత స్థాయిలో చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఆవశ్యకత ఉందని చెప్పారు.
వైద్య చికిత్సలకు సంబంధించి మరిన్ని ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందని, వాటిని ప్రజల వద్దకు విస్తృతంగా తీసుకెళ్లాలని అపోలో సంస్థల ఛైర్మన్, సీఈఓ డాక్టర్ మధు శశిధర్ సూచించారు. ఈ మేరకు అపోలో ‘ప్రో హెల్త్ స్కోర్’ పేరుతో దేశంలోనే తొలి డిజిటల్ హెల్త్ కౌంటింగ్ టూల్‌ను విడుదల చేసింది. దీనిద్వారా తమ ఆరోగ్యంపై స్వీయ అంచనాకు వచ్చి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టటానికి అవకాశం లభిస్తుందని అపోలో హాస్పిటల్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అసాంక్రమిక వ్యాధులు దేశ ఆర్థికవ్యవస్థకు రూ.లక్షల కోట్ల మేర నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో.. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ టూల్ ఎంతో ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.