ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన అన్ని క్రిమినల్ కేసులు, అప్పీళ్లు, పునర్విచారణకు ప్రాధాన్యత ఇవ్వాలని న్యాయమూర్తులను కోరింది. తద్వారా కేసులను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించవచ్చని సూచించింది. ట్రయల్ కోర్టులతో పాటు హైకోర్టులో ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్‌లో ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన డివిజన్ బెంచ్ సుమోటాగా విచారించి ఉత్తర్వులు జారీ చేసింది.
సింగిల్ జడ్జి ముందు పెండింగ్‌లో ఉన్న కేసులను తిరిగి కేటాయించాలని లేదా పునఃపంపిణీ చేయాలని రిజిస్ట్రీని కోరింది. వీటిలో విచారణపై స్టే, ఆరు నెలలకు పైగా స్టే కొనసాగుతోన్న కేసులు 34 ఉన్నాయి. ‘దీనివల్ల స్టే విధించిన కేసులు త్వరితగతిన పరిష్కరమవుతాయి.. అటువంటి కేసుల విచారణకు ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టుల ముందు వీటిని ముగించవచ్చు’ అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా 2016లో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా హైకోర్టు న్యాయమూర్తులకు తీర్పు కాపీలను అందజేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
‘ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు విచారిస్తోన్న తోటి న్యాయమూర్తులకు ఉత్తర్వులను పంపిణీ చేయాలని ఈ కోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తోంది.. తద్వారా పార్లమెంటు, శాసనసభ సభ్యులపై పెండింగ్‌లో ఉన్న అన్ని క్రిమినల్ కేసులు/ అప్పీళ్లు/ రివిజన్‌లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది... అటువంటి కేసులను త్వరితగతిన, ప్రభావవంతంగా విచారణకు చాలా అవసరం.’ అని ధర్మాసనం పేర్కొంది.
‘శాసనసభ్యులపై మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించే కేసులు, ఆ తర్వాత ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించే కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రత్యేక ఎంపీ /ఎమ్మెల్యే కోర్టులను హైకోర్టు ఆదేశిస్తోంది. అరుదైన, బలవంతపు కారణాల వల్ల తప్ప కేసులను వాయిదా వేయకూడదని న్యాయమూర్తులందరినీ మేము అభ్యర్థిస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో కోరింది.