మధ్య ప్రదేశ్‌లో ప్రధాన పుణ్య క్షేత్రాలు ఉన్న 17 పట్టణాల్లో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయబోతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. శుక్రవారం రోజు ఖర్‌గోన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ 17 ప్రాంతాల్లో ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఆరు నగర పాలికలు, ఆరు నగర పరిషత్‌లు, ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నట్లు వెల్లడించారు. ఇవి మాత్రమే కాకుండా నర్మదా నది పరివాహక ప్రాంతానికి 5 కిలో మీటర్ల పరిధిలోని మద్యం దుకాణాలు కూడా బంద్ కాబోతున్నట్లు స్పష్టం చేశారు.
ముఖ్యంగా ప్రభుత్వం మద్యం బంద్ చేయబోతున్న ప్రాంతాల్లో దాతియా, పన్నా, మాండ్లా, ముల్తాయి, మంద్‌సౌర్, మైహర్ నగర్ పాలిక, ఓంకారేశ్వర్, మహేశ్వర్, మాండ్లకేశ్వర్, ఓర్ఛా, చిత్రకూట్, అమర్ కంటర్ నగర్ పరిషత్, సల్కాన్ పుర్, బర్మన్ కాలా, లింగా, కుండల్ పుర్, బందక్ పుర్, బర్మన్ ఖుర్ద్‌లు ఉన్నాయి. ఈ 17 ప్రాంతాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కొలిచే అనేక దేవుడి గుడులు ఉన్నాయి. ఈక్రమంలోనే ఈ అన్ని ప్రాంతాల్లో సర్కారు మద్యం బంద్ చేస్తోంది.
అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు ఈ నిర్ణయం చాలా మంచిదని ముఖ్యమంత్రిపై పొగడ్తల వర్షం కురిపిస్తుండగా.. మద్యం బాబులు మాత్రం ఇది సరైన నిర్ణయం కాదంటూ చెప్పుకొస్తున్నారు. వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటూ.. ఇకపై మన పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. వీటిపై పలువురు ప్రజా ప్రతినిధులు స్పందిస్తూ.. రాష్ట్రంలోని యువత సన్మార్గంలో నడవాలంటే మద్యం బంద్ చేయడమే మంచిదని చెబుతున్నారు. అలాగే బీజేపీ సర్కారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని గుడులకు, పుణ్య క్షేత్రాలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం పెరుగుతూ వస్తోందని సమాన్య ప్రజానీకం వివరిస్తోంది.