వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. టీడీపీతో రాజకీయంగా విభేదించానే తప్ప... చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది అని వెల్లడించారు. ఇక, నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని విజయసాయి తన వీడ్కోలు ప్రకటనలో పేర్కొన్నారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని అంటూ ట్వీట్ చేశారు. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. "పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ/రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశాను... కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాను. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి... కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని అందించి... తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ విజయసాయి పేర్కొన్నారు.