పాల ఉత్పత్తి సంస్థ అమూల్ తాజాగా పాల ధరలను దేశ వ్యాప్తంగా తగ్గిస్తున్నట్లు వివరించింది. అయితే ఈ విషయాన్ని నేరుగా గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా శుక్రవారం రోజు ప్రకటించారు. అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ టీ స్పెషల్ పాలపై ఒక్క రూపాయి చొప్పున తగ్గించినట్లు వివరించారు. అయితే ఈ తగ్గింపు కేవలం ఒక లీటర్ ప్యాకెట్‌కు మాత్రమే వర్తిస్తుందని కూడా వివరించారు. మరి ధరలు తగ్గడంతో.. ప్రస్తుతం ఒక లీటర్ ప్యాకెట్ ఎంతకు లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ధరల తగ్గింపుతో అమూల్ గోల్డ్ మిల్క్ ధర రూ.66 నుంచి 65 రూపాయలకు తగ్గనుంది. అలాగే అమూల్ టీ స్పెషల్ మిల్క్ ఒక లీటర్ ప్యాకెట్ గతంలో 62 రూపాయలకే లభించగా.. ఇప్పుడు 61 రూపాయలకే అందుబాటులోకి రాబోతుంది. ఇక అమూల్ తాజా పాల ధర లీటరుకు రూ.54 నుంచి రూ.53కి తగ్గబోతుంది. 2024 జూన్ నెలలో అమూల్ పాల ధరలను లీటరుకు రెండు రూపాయల చొప్పున పెంచింది. అమూల్ పాల ధరలను అదే మార్జిన్‌తో పెంచడంతో మదర్ డెయిరీ కూడా పాల ధరలను లీటరుకు 2 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇన్నాళ్లూ పాల ధరల పెంపుతో సమస్యలు ఎదుర్కున్న వినియోగదారులకు.. అమూల్ ధరలు తగ్గించడంతో ఉపశమనం కల్గబోతుంది. ముఖ్యంగా వినియోగదారులకు ఉపశమనం కల్గించడంతో పాటు పాల వినియోగాన్ని మరింత పెంచడమే లక్ష్యంగానే ధరలు తగ్గించినట్లు అమూల్ ఎండీ జయేన్ మెహతా తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వినియోగదారులు తెగ సంబుర పడిపోతున్నారు.