అమెరికా వచ్చిన వారికి పుట్టబోయే పిల్లలకు జన్మతః పౌరసత్వం లభించకుండా చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. ఈ ప్రకటనతో అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం, ఆ దేశ పౌరసత్వం కోసం ఎదురు చూస్తోన్న కోట్లాది మందిలో ఆందోళన మొదలైంది. ఫిబ్రవరి 20 నుంచి జన్మతః పౌరసత్వం రద్దవుతుందని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఆదేశాలు అమలుకు అనేక అవాంతరాలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ఆదేశాలు అమల్లోకి రావడానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి అవసరం ఉంది. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే అమెరికాలోని 22 రాష్ట్రాలు, పౌర హక్కుల సంఘాలు కోర్టులో దావా వేశాయి.
దీంతో జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను సియాటిల్ జడ్జి తాత్కాలికంగా అడ్డుకున్నారు. అమెరికా సీనియర్ జిల్లా జడ్జి అయిన జాన్ కోహెనర్.. ట్రంప్ ఆదేశాలను నిలువరించేలా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలో జన్మించిన ప్రతి వ్యక్తి అమెరికన్ పౌరుడేనని రాజ్యాంగంలో పేర్కొన్నారన్న ఆయన... ట్రంప్ చర్యలను విమర్శించారు.
“40 ఏళ్ల నా అనుభవంలో.. బెంచ్‌కు సమర్పించిన ప్రశ్న ఇంత స్పష్టంగా ఉన్న మరొక సందర్భం నాకు గుర్తులేదు. ఇది (ట్రంప్ తీసుకొచ్చింది) రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వు” అని న్యాయమూర్తి కోహెనర్ వ్యాఖ్యానించారు. డౌన్‌టౌన్ సియాటెల్‌లోని కోర్ట్ రూమ్‌లో మాట్లాడిన కోహెనర్.. అటార్నీ బ్రెట్ షుమేట్ మాట్లాడటం మొదలుపెట్టగానే అడ్డుతగిలారు. మీ దృష్టిలో ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగబద్ధమేనా? అని ఆయన అటార్నీని సూటిగా ప్రశ్నించారు.
దీనికి షుమాటే బదులిస్తూ.. ఇది కచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే ఉందన్నారు. దీనికి జడ్జి బదులిస్తూ.. ‘బార్‌లోని ఒక సభ్యుడు ఇది రాజ్యాంగపరమైన ఉత్తర్వు అని నిస్సందేహంగా ఎలా చెప్పగలడో అర్థం చేసుకోవడం నాకు కష్టంగా ఉంది’ అన్నారు. ఇది తన మనసును కలచివేసిందన్నారు.
సియాటెల్ జడ్జి ఆదేశాల ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14 రోజులపాటు బ్లాక్ చేయబడుతుంది. ఇదే సమయంలో వాషింగ్టన్, ఇతర ప్రాంతాలలో వ్యాజ్యాలు కొనసాగుతాయి. ఆ తర్వాత కోహెనర్ ప్రిలిమినరీ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చేలా పిటిషన్ వేసిన వాషింగ్టన్ కోరుతుంది. దీని వల్ల కేసులు ముందుకు సాగుతున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమలు చేయకుండా చూడవచ్చు.