బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ దాడి కేసులో ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడే అసలైన నేరస్థుడు అంటూ గట్టిగా నమ్మిన పోలీసులే.. అతడికి ఫేస్ రికగ్నిషన్ టెస్ట్ నిర్వహిస్తామంటూ మరోసారి కస్టడీ కోరారు. దాడి జరిగిన రోజు సీసీటీవీలో కనిపించిన అతను, పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు ఒకరేనా కాదా అని తేల్చేందుకే ఈ పరీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రజలంతా షాక్ అవుతున్నారు. అసలు నిందితుడు ఇతడేనా, కాదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
జనవరి 16వ తేదీ రోజు వేకువజామున 2.30 గంటలకు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ హీరోపై ఓ నిందితుడి దాడికి పాల్పడగా.. వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మొత్తం 10 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. ఇతడే నిందితుడు అంటూ ఓ వ్యక్తి ఫొటోను కూడా విడుదల చేశారు.
ఇలా ఫొటో విడుదల చేసిన రెండు రోజుల తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్తాం షెహజాద్ మహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్‌ను.. థాణే అటవీ ప్రాంతంలో ఉన్న ఓ లేబర్ క్యాంపు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అదేరోజు మధ్యాహ్నం ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈక్రమంలోనే అతడిని మరింతగా విచారించాలని కోరుతూ.. పోలీసులు కస్టడీ కోరారు. దీంతో కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ ఐదు రోజులు నేటితో పూర్తి కావడంతో మరోసారి కోర్టులో హాజరు పరిచారు నిందితుడిని.
కానీ పోలీసులు ఈరోజు కోర్టు ముందు షాకింగ్ కామెంట్లు చేశారు. నిందితుడైన బంగ్లాదేశీయుడికి ఫేస్ రికగ్నేషన్ టెస్ట్ చేస్తామని న్యాయస్థానానికి తెలిపారు. దాడి జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తి, అరెస్టైన నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ అలియాస్ మహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ ఒక్కరేనా కాదా అని తేల్చేందుకు ఈ పరీక్ష చేస్తామన్నారు. దీంతో మరోసారి కోర్టు నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిచ్చింది.