మహారాష్ట్రలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని భండారా జిల్లాలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్తే తెలిపారు. ఒక్కసారిగా సంభవించిన ఈ పేలుడుతో భారీ ఎత్తున శబ్దం వచ్చిందని.. దాదాపు 5 కిలో మీటర్ల మేర ఈ శబ్దం వినిపించిందని వివరించారు. అలాగే పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు పూర్తిగా కూలిపోయిందని స్పష్టం చేశారు. ఓవైపు మంటలు, మరోవైపు పొగలు.. ఇవి చాలవన్నట్లు భవనం పైకప్పు కూలడంతో.. అందులో ఉన్న పలువురు కూలీలకు విపరీతమైన గాయాలు అయ్యాయని స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతుంటే, మరోవైపు పోలీసులు కూలిన పైకప్పు కింద ఎవరైనా చిక్కుకున్నారేమో గుర్తించారు. బయటకు తీసిన వారిని తీసినట్లుగానే అంబులెన్సుల ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఇలా ఇప్పటి వరకు మొత్తం 8 మంది చనిపోయిగా... మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శిథిలాల కింద ఇంకా కూలీలు ఉన్నారనే అనుమానంతో.. పోలీసులు ఎస్ఆర్డీఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించింది.
జేసీబీ సాయంతో శిథిలాలను తొలగిస్తూనే.. కూలీల గురించి గాలిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని అధికారులకు సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు వెల్లడించారు. మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే స్పందిస్తూ.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పేలుడు ఘటన మోదీ ప్రభుత్వ వైఫల్యమే అంటూ విమర్శలు చేశారు.