రాజకీయ కుట్రలో భాగంగా జనసేనను నాశనం చేశారని పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. సోమవారం నాడు ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న సీట్లపై కాపులు ఎవరూ సంతృప్తిగా లేరని చెప్పారు. పొత్తులో భాగంగా 24సీట్లు తీసుకోవడం తమ పార్టీ నేతలకు ఎవరికి ఇష్టం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో కులాల మధ్య పవన్ కళ్యాణ్ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. బీసీ సామాజిక వర్గం నుంచి నర్సాపురం అసెంబ్లీ సీటును బొమ్మిడి నాయకర్ ఒక్కరికే సీటు కేటాయించారన్నారు. మిగతా నేతలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. కాపులు, బీసీల మధ్య చిచ్చు పెట్టేలా పవన్ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. గతంలో భీమవరం నుంచి పవన్ పోటీ చేశారని.. మరి ఇప్పుడేందుకు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు.తన సీటును పిఠాపురానికి పవన్ ఎందుకు మార్చుకున్నారని నిలదీశారు. భీమవరంలో బలంగా లేని టీడీపీకి సీటు ఎందుకు కేటాయించారని అడిగారు. అక్కడ జనసేన కోసం పనిచేసిన నేతలకు ఎవరికి అయిన సీటు కేటాయిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. భీమవరంలో వైసీపీ నేతలు సొంత ఇల్లు కట్టుకోనివట్లేదని పవన్ చెప్పడం అబద్ధమని పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. పిఠాపురం వెళ్లి తనను గెలిపించాలని టీడీపీ నేత వర్మను పవన్ కోరలేదా అని పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. సాయంత్రం తానే పోటీ నుంచి తప్పుకున్నానని ఆ టీడీపీ నేతతో చెప్పిస్తారని ఎద్దేవా చేశారు. జనసేన నేత నాగబాబుకు ఇచ్చిన అనకాపల్లి సీటును ఎందుకు వదులుకున్నారని నిలదీశారు. ఆ సీటును ఎందుకు త్యాగం చేశారో పవన్ కళ్యాణ్ చెప్పాలని ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో కంపెనీల నుంచి డబ్బులు వసూళ్లు చేయలేదా అని నిలదీశారు. వారు ఫిర్యాదు చేశారనే ఆ సీటును నాగబాబు వదులుకున్నారని ఆరోపించారు. గతంలో నాగబాబుకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉండలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే నాగబాబును వదిలేశారని పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు.