తాము మొదటి నుంచి చెపుతూనే ఉన్నామని.. అధికారులు తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేశారని అప్పుడే అన్నామని టీడీపీ నేత పట్టాభి అన్నారు. హెరిటేజ్ డాక్యుమెంట్ల దగ్ధం ద్వారా తాము చెప్పింది నిజం అని ఇప్పుడు తేలిపోయిందన్నారు. తప్పు లేకపోతే ఎందుకు ఈ డాక్యుమెంట్లు తగలబెడుతున్నారని ప్రశ్నించారు. దొంగచాటుగా డాక్యుమెంట్లు ఎందుకు నాశనం చేస్తున్నారని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి తిరిగి రాదని తేలిపోవడంతో ఇప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హెరిటేజ్‌కు సంబంధించి ఐటి రిటర్న్‌లు మీకు ఎలా వచ్చాయి అని గతంలోనే నారా లోకేష్ ప్రశ్నించారన్నారు. ఇటువంటి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి చంద్రబాబును అన్యాయంగా 53 రోజులు జైల్లో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు ప్రభుత్వం మారినా దొరక్కుండా ఉండేదుకే ముందస్తుగా పత్రాలు ధ్వంసం చేశారన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ఇటువంటి తప్పుడు అధికారులను చేతిలో పెట్టుకొని తప్పుడు కేసులు నమోదు చేశారని పట్టాభి మండిపడ్డారు.