మేమంతా సిద్ధం ర్యాలీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద రాయితో దాడి జరగటం ఇప్పుడు ఏపీ వ్యా్ప్తంగా సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు భద్రతా వైఫల్యమే ఇందుకు కారణమని విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార వైసీపీ మాత్రం టీడీపీ నేతలు చేయించిన పని అంటూ విమర్శలు చేస్తోంది. అయితే ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి పక్కనపెడితే.. ఈ ఘటనతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఏకంగా సీఎం మీదే రాయితో దాడి జరగడం వారిని కలవరపరిచింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ భద్రతపై నిఘా విభాగం అధికారులు కీలక సూచనలు చేశారు.
గాయం కారణంగా సీఎం జగన్ ఈరోజు బస్సుయాత్రకు విరామం ఇచ్చారు. ఇక రేపటి నుంచి మేమంతా సిద్ధం బస్సుయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జరిగే బస్సుయాత్రలో పలుమార్పులు చేయనున్నట్లు తెలిసింది. వైఎస్ జగన్ బస్సుకు వంద మీటర్ల దూరం వరకూ కార్యకర్తలను, ప్రజలను అనుమతించవద్దని నిఘా విభాగం అధికారులు సూచించినట్లు తెలిసింది. అత్యవసరమైతే తప్ప జగన్ ఉన్న బస్సు సమీపంలోకి నేతలు, కార్యకర్తలు అనుమతించరు. ఇదే సమయంలో రోడ్ షో విషయంలోనూ నిఘా విభాగం పలు సూచనలు చేసింది. గతంలో మాదిరిగా బస్సుపై నుంచి అభివాదం వద్దని చెప్పిన నిఘా విభాగం అధికారులు .. బస్సులో నుంచే రోడ్ షో చేయాలని సూచించింది. అలాగే ర్యాలీ సమయంలో క్రేన్లు, గజమాలలు తగ్గించాలని నిఘా విభాగం అధికారులు చెప్పినట్లు తెలిసింది. వీటితో పాటుగా వైఎస్ జగన్‌కు, జనం మధ్యలో బారికేడ్లు ఉంచాలని సైతం చెప్పినట్లు సమాచారం.
మరోవైపు జగన్‌పై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అలాగే ఘటనపై విజయవాడ సీపీ కాంతి రాణా ఎన్నికల సంఘానికి నివేదిక అందజేశారు. దర్యాప్తు కోసం 20 మంది పోలీసులతో 6 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇక నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదుచేసిన విషయాన్ని కాంతి రాణా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా సీపీ కూడా దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి రిపోర్ట్ ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని తెలియజేశారు.